Tuesday, December 16, 2014

క్రిస్మస్

2000సంల క్రితం యేసుక్రీస్తు ఈలోకములో పుట్టాడని, 2000 సంవత్సరాల ముందు ఆయనకు ఏ చరిత్ర లేదని అనుకుంటుంది ఈ అమాయక ప్రపంచములోని అమాయక మనుషులు. వాక్యము తెలియని భోదకుల సైతం యేసు 2000సంల క్రితంఈలోకములో పుట్టాడని ఘంటాపదంగా భోదిస్తున్నారు. ఇలా చెప్పుట వలన ప్రపంచం అయన పుట్టింది 2000సంల క్రితమే కదా మరి అయన కంటే బుద్ధ, అలక్షాండెర్, ఎంతో మంది రాజులు వచ్చారు కదా మరి వాళ్ళందరి తర్వాత వచ్చిన అతను యేసుక్రీస్తు అని, వాళ్ళందరి కంటే చిన్నవాడు యేసుక్రీస్తు అని చెబుతున్నారు.

అనేకులు భావిస్తున్నట్లుగా యేసు కన్య మరియ గర్బాన్న2000సంల క్రితం పుట్టినా, ఈ సృష్టి పుట్టక మునుపే పరలోకములో ఉన్నాడు. నేటి క్రైస్తవులు సైతము యేసు కన్య మరియ గర్భాన పుట్టిన ఘటననే మాటిమాటికి చెబుతూ, పండగలుగా(క్రిస్మస్) ఆచరిస్తున్నారే గానీ, యేసు జగత్తు పునాది వేయబడక ముందే ఉన్నవాడని ప్రపంచం గుర్తించేలా ఎలుగెత్తి చాటటం లేదు. పరలోకమందు ప్రారంభమైన మహనీయునిగా యేసుని చూడవలసిన ప్రపంచము, మట్టిలోకములో పుట్టిన మట్టి మనిషి గానే చూస్తున్నారంటే తప్పు ఈ భోదకులదే కాదంటారా?

వాక్యము తెలిసిన క్రైస్తవులైన మనము యేసుక్రీస్తును పరిచయం చేయు విధానము తెలియకపోవుట వలన ఇలా తప్పుడు అభిప్రాయము కలిగి, తప్పుడుగా ఆలోచిస్తూ, తప్పుడుగా భోదిస్తున్నారు. వాస్తవముగా యేసుక్రీస్తును పరిచయం చేయవలసిన తీరు ఇది కాదనే చెప్పాలి.

అస్సలు యేసుక్రీస్తు 2000సంల క్రితం ఈ లోకమునకు వచ్చాడా లేక పుట్టాడాన్న ప్రాముఖ్యమైన మూల విషయము తెలుసుకోవాలి. హెబ్రీ 10:5 కాబట్టి అయన ఈ లోక మందు “ప్రవేశించునప్పుడు” ఈలాగు చెప్పుచున్నాడు. వచ్చాడు అంటే అంతకముందుగానే ఉన్నవాడని అర్థమవుతుంది. ఉదా: నేనునెల్లూరు నుండి హైదరాబాద్ కూ వచ్చాననుకోండి. అనగా అంతక ముందు నేను నెల్లూరులో ఉన్నానని మరియు ఉన్న నేను హైదరాబాద్ కూ వచ్చానని అర్థమవుతుంది. అలానే యేసుక్రీస్తు 2000సంల క్రితంఈ భూమి మీదకు వచ్చాండంటేఅంతకుముందు అయన ఎక్కడో ఉన్నాడని అర్థమవుతుంది. అంటే అయన చరిత్ర 2000సంల క్రితముది కాదని,అంతకంటే ముందు యేసుక్రీస్తుకు చరిత్ర ఉందని ప్రపంచమునకు, మనము తెలియజేయాలి.

2000సంల క్రితం ఈ లోకానికి వచ్చాడు అంటే ఎప్పుడు పుట్టాడు? పుట్టుక ఎప్పుడు జరిగింది? తన పుట్టుక గురించి తను చెప్పిన సంగతి చూస్తే సామెతలు 8:22-26  పూర్వ కాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. పై వచనాలలో సృష్టి పుట్టకముందే పుట్టినట్టుగా అర్థమవుతుంది. అనగా అసలైన పుట్టుక జగత్తు పునాది వేయబడకముందే యేసుక్రీస్తు పుట్టాడు. కీర్తనలు2:7 యెహోవా నాకిలాగుసెలవిచ్చెను –నీవునా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. ఇలా తండ్రి ఎప్పుడైతే యేసుతో అన్నాడో ఆ రోజున పుట్టిన వాడు. యేసుక్రీస్తు ఎప్పటివాడు?

యోహాను 1:1 ఆది యందు వాక్యము ఉండును. వాక్యము దేవుని యెద్ద ఉండెను.వాక్యము దేవుడై ఉండెను. యోహాను1:14 ఈ వాక్యము శారిరధారియై యేసుగా వచ్చెను. ప్రకటన 19:13 దేవుని వాక్యము అను నామము ఆయనకు(యేసు) పెట్టబడియున్నది. ఇప్పుడు వాక్యము అనగా యేసు అను మాటను యెహోవా1:1లో పెట్టి చదవండి. అనగా అది నుండి దేవుని యెద్ద దేవుడిగా ఉన్నాడు యేసు. అయన సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. యెషయ 9:6 మనకు శిశువు పుట్టెను. ఇక్కడే పుట్టెను అను మాట ఉంది కానీ పుట్టబోవుతున్నాడు అని లేదు.యెషయ చెప్పక ముందే యేసు పరలోకములో ఉన్నాడు. యోహాను1:3 కలిగి ఉన్నదేదియు అయన(యేసు) లేకుండా కలుగలేదు. అంటే యేసు సృష్ట పుట్టక ముందే తండ్రి దగ్గర ఉన్నాడు.

అయన జగత్తు పునాది వేయబడక ముందే పుట్టాడని యేసును గూర్చి ప్రపంచమునకు పరిచయం చేయాలి. సైన్సు ప్రకారముగా ఈ ప్రకృతి పుట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలని అంటున్నారు. ప్రకృతి పుట్టక మునుపేయేసుక్రీస్తు పుడితే నేటికి ప్రకృతి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయితే యేసు ఎంతటి కాలమునకు క్రిందటి వాడు? ఇంత గొప్ప చరిత్ర కలిగిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎప్పుడో పుట్టినవాడు ఈ లోకానికి వచ్చాడు. ప్రకటన 19:16 రాజులకు రాజును,ప్రభువుల కు ప్రభువును అను నామము అయన వస్త్రము మీదను,తోడ మీదను వ్రాయబడింది. అనగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినవాడు రాజులకు రాజు,ప్రభువులకు ప్రభువు అని పరిచయం చేయాలి. ఏ కారణం లేకుండా యేసుక్రీస్తుఈ లోకానికి వస్తాడా? ఉదా:: అప్పుడప్పుడు ముఖ్య మంత్రి లేక ప్రధాన మంత్రి మన ప్రాంతమునకు వస్తుంటారు. ఒక్క పని కోసమే కాక అనేక పనులను ముందుగా నిర్ణయించుకొని వస్తారు. అనగా శంకుస్థాపన-విగ్రహ ఆవిష్కరణ-రచ్చబండ పాల్గొనుట- సాయంత్రపు మహా సభలలో మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్య మంత్రి ఒక ప్రాంతం వెళ్ళాలంటే సమయము తీరిక లేకుండా చేసుకునివస్తాడో మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు సంగతి ఏంటి? ఏ కారణాలు లేకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటారా?లేదు. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఫిలిఫు 2:6  అయన (యేసుక్రీస్తు) దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గానీ “మనుష్యుల పోలికగా పుట్టి”,”దాసుని స్వరూపమును ధరించుకుని”,తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను.మరియు అయన అకారమందు మనుష్యుడుగా కనబడి,మరణము పొందునంతగా అనగా “సిలువ మరణము పొందునంతగా” విధేయత చూపినవాడై ,తన్ను తాను తగ్గించుకొనేను.

భూమి పుట్టక మునుపు అయన పుడితే ఒక వేళ అయన పుట్టుక క్రిస్మస్ అనుకుంటే డిసెంబర్ 25 ఎప్పుడు వచ్చింది? భూమి పుట్టిన తర్వాత డిసెంబర్ 25 ఏర్పడింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టిన తేది డిసెంబర్ 25 నా? యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 

యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ముఖ్యముగా ఏడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాము:

(a) మొదటి కారణము - తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయుట కొరకు, తండ్రి మనస్సును బయలు పరచడానికి యేసుక్రీస్తుఈ లోకానికి వచ్చాడు. ప్రపంచ మంతా పరలోకపు తండ్రిని గుర్తించలేని పరిస్థితిగా ఏర్పడింది. యోహాను 1:18 ఎవడును, ఎప్పుడైనను దేవునిని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను. అనగా పరలోకపు తండ్రి మనస్సును ప్రపంచానికి చూపించుట కొరకు, తండ్రి మనస్సులో ఉన్న ఉద్దేశాలను, భావాలను,ఇష్టాలను,చిత్తాన్ని ఈ లోకానికి చూపించుట కొరకు వచ్చాడు.

(b) రెండవ కారణము - దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు, సాతాను రాజ్యాన్ని చూపించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యెషయ 9:6 అయన భుజము మీద రాజ్య భారముండెను. యేసుక్రీస్తు ఈ లోకానికి రాజ్య స్థాపన చేయుటకు వచ్చాడు.అయన రాక ముందు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలి. నాలుగు సామ్రజ్యాలు భయంకరముగా పరిపాలిస్తున్న కాలము ఆది. 1. నెబుకద్నేజరు చేత పరిపాలింపబడిన బబులోను సామ్రాజ్యం 2. మాదియ పారసికుల సామ్రాజ్యం 3. గ్రీక్ సామ్రాజ్యం 4. రోమా సామ్రాజ్యం. దానియేలు 2:44 ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును.దానికెన్నటికి నాశనము కలుగదు.ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికి చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్ములము చేయును గానీ ఆది యుగములు వరకు నిలుచును. పై వచనములో అయన మొదటి రాకడలో రాజ్యం వస్తుందని,రాజ్య స్థాపన జరుగుతుందని అర్థమవుతుంది. లూకా1:33 అయన(యేసు క్రీస్తు) రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో చెప్పెను.పైవచనములో గబ్రియేలు దేవ దూత మరియతో రాజ్యము గూర్చి తెలియపరచడమైనది. లూకా17:20 దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు అయన-దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదీ. దేవుని రాజ్యమును స్థాపించుటకు, ఆ రాజ్యానికి ఆహ్వానించుటకు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రాజ్యమును స్థాపించుటకే కాక మరొక రాజ్యమును చూపించుటకు వచ్చాడు. మత్తయి 12:26 సాతనును వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరు పడును.అట్లయితే వాని రాజ్యమేలాగు నిలుచును?? అనగా సాతాను రాజ్యము అప్పటికే లోకములో ఉంది.

(c) మూడవ కారణము - పాపులను రక్షించుటకు ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మత్తయి 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనేను. లూకా19:10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. పై వచనాలను పరిలిస్తే యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చినట్టుగా అర్థమవుతుంది.

(d) నాల్గోవ కారణము - అన్యజనులైన మనకు రక్షణను కలుగజేసి దేవుని ఇంటివారిగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు.. యేసుక్రీస్తు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఒక్క ఇశ్రాయేలియులకు తప్ప నిజమైన దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు. అప్పటిలో ఎందరో ప్రవక్తలు అనేక ప్రవచనాలు అనగా త్వరలో మెస్సయ వస్తాడని, ఇంతవరకు ఉన్న అన్యజనులందరిని ఇశ్రాయేలియులతో సమానము చేస్తాడని అప్పుడు అన్యజనులకు కూడ దేవుడు తెలియబడతాడని ప్రవచించారు. యెషయ 2:2  ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు, యెషయ2-4 అయన మధ్యవర్తియై అన్యజనులకు న్యాయము తీర్చును, యెషయ 42:1 అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును, యెషయ 42:7 అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించియున్నాను. అనగా యేసుక్రీస్తు అన్యజనులను దేవుని ఇంటిలోనికి లాగుటకు వచ్చాడు. అన్యజనులను  శ్రాయేలియులతో సహా పౌరులుగా చేయుటకు వచ్చాడు. ఒక వేళ యేసుక్రీస్తు రాకుంటే మన పరిస్థితి ఏంటి? నిజమైన దేవునిని తెలియని వారముగా బ్రతికి ప్రాణము విడిచేవారము. అయన లేకుండా ఒక్కసారి మన జీవితాలను ఆలోచిస్తే భయం పుడుతుంది. యేసుక్రీస్తును బట్టి మనకు పరలోకం వస్తుందని ఆశతో ఉన్నాము.

(e) ఐదవ కారణము - ధర్మశాస్త్రము అను చెరలో ఉన్నవారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చేంత ముందు ఇశ్రాయేయులు ధర్మశాస్త్రము అనే చెరలో ఉన్నారు. గలతీ 3:23 చెరలో ఉంచబడినట్టు మనముధర్మశాస్త్ర మునకు లోనైనవారమైతిమి. లూకా  4:18 చెరలో ఉన్నవారిని విడిపించుటకు అయన నన్ను పంపెను. ఎఫేసి 2:14 మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన అజ్ఞాలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. హెబ్రీ 10:9 ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు.

(f) ఆరవ కారణము - మనలాంటి శరీరంతో ఉన్నను ఏ మచ్చ లేకుండా జీవించవచ్చు అని చెప్పుటకు వచ్చాడు. యోహాను 8:46 నా యందు పాపమున్నదని మిలో ఎవడు స్థాపించును? మనలాంటి మట్టి శరీరంతో ఉన్నను పాపం లేకుండా జీవించాడు. 

(g) ఏడవ కారణము - అంత్యదినాలను ప్రారంభించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీ 1:1 ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. 1పేతురు 1:20,21 కడవరి కాలమందు అయన ప్రత్యక్ష పరచబడెను. 1 యోహాను 2:18 ఇది కడవరి ఘడియ. 

పై చెప్పబడిన ముఖమైన ఏడు ప్రధాన కారణాలతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. కనుకకేవలము క్రిస్మస్ దినమున మాత్రమే యేసును గూర్చిన మాటలే ప్రకటించక ప్రతి దినము ప్రకటించాలి. యేసు క్రీస్తు ఎవరో, ఈ లోకానికి రాక ముందు ఎక్కడ ఉన్నాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, యేసులో ప్రత్యేకత ఏంటో ఇలా అనేక అంశాలతో కూడిన సువార్తను కేవలము క్రిస్మస్ దినమునే కాక ప్రతి దినము ప్రకటించి కొందరినైన నరకము నుండి వారి ఆత్మను తప్పించి దేవుని వైపు మళ్ళిద్దాం. మార్క్ 16:15 మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.నమ్మి బాప్తీస్మం పొందిన వాడు రక్షించబడును;నమ్మనివానికి శిక్ష విధింపబడును.