Friday, February 13, 2015

బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్న చారిత్రక ఆధారాలు

బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్న చారిత్రక ఆధారాలు ఖుమ్రాన్ గుహలలో లభ్యమైన వ్రాతప్రతులు ఒక గ్రంధాన్ని గాని పుస్తకాన్ని గాని సత్యమని చెప్పాలంటే.. నమ్మాలంటే కొన్ని రంగాల్లో ఆ గ్రంధము ఋజువు చేయబడాలి. శాస్త్రీయ ఆధారాలు.. భౌగోళిక ఆధారాలు, పురావస్తు నిదర్శనాలు, చారిత్రక ఆధారాలు, విశ్వవ్యాప్త అంగీకారం ఆ గ్రంధాన్ని ధృడపరచుతాయి. ప్రపంచంలో ఏ గ్రంధానికి లేనటువంటి తిరుగులేని ఆధారాలు, నిదర్శనాలు పరిశుద్ధ గ్రంధానికి ఉన్నాయి. దేవుని అధికార ముద్ర, ప్రవక్తల ప్రవచనాలు ఇవన్నీ బైబిల్ ప్రత్యేకతకు తార్కాణాలు. అనునిత్యమూ ఎన్నో ఎన్నో పరిశోధనలు ప్రపంచంలో జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో విశిష్ట నిధులు బయటపడుతూనే ఉన్నాయి.

దాదాపు చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, విలువైన నిధులు కొన్ని సం||రాల క్రితం బయటపడ్డాయి. అవే ఖుమ్రాన్ గుహలలో బయటపడ్డ బైబిల్ యొక్క వ్రాతప్రతులు ఖుమ్రాన్ గుహలలో లభించిన తిరుగులేని ఆధారాలు బైబిల్ యొక్క చారిత్రక ఔన్నత్యాన్ని తెలియచేస్తున్నాయి. వాటినే మృతసముద్రపు వ్రాతప్రతులు (Dead Sea Scrolls) అని కూడా అంటారు. వాటి వివరాల్లోకి వెళితే... ఇశ్రాయేలీయుల దేశంలో ఉన్న మృత సముద్రానికి ఒక మైలు దూరంలో ఈ ఖుమ్రాన్ గుహలు కనబడతాయి. ఈ ప్రాంతమే ఇప్పుడు ప్రపంచమంతా చర్చనీయాంశం. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ఖుమ్రాన్ గుహలలోనే బైబిల్ వ్రాతప్రతులు దొరికాయి. క్రీ|| పూ||134 సం||లో జాన్ హిర్కనస్ పాలనలో ఈ ఖుమ్రాన్ గుహలలో కొంతమంది గ్రీకులు ఉండేవారు. ఆ తరువాత క్రీ.శ.68లో రోమన్లు వారిని అక్కడ నుండి పంపించి వేశారు.

ఖుమ్రాన్ గుహల్లో జరిగిన అనేక పరిశోధనల్లో బైబిల్కి సంబంధించిన అద్భుత వ్రాతప్రతులు బయటపడ్డాయి. 1947 సం|| నుండి 1956 సం|| వరకు జరిగిన పరిశోధనల్లో 900కు పైగా లిఖిత పత్రాలు లభ్యమయ్యాయి. దాదాపు ఖుమ్రాన్ ప్రాంతంలో ఉన్న 11 గుహల్లో అవి లభ్యం కావడం గమనార్హం. బైబిల్ గొప్పతనం అర్ధం చేసుకోవడానికి ఆ గుహల ఫోటోగ్రాఫ్స్ చూడండి. అది 1947 ఫిబ్రవరి 16... ఖుమ్రాన్ గుహల ప్రాంతంలో గొర్రెల కాపరులుగా ఉన్న మహ్మద్ ఎదీబ్ మరియు అతని తమ్ముడు మొదటిసారిగా మట్టి కుండలను ఈ ప్రాంతాల్లో చూశారు. ఎంతో ఆశతో ఆసక్తితో ఆ కుండల యొద్దకు వెళ్ళి వాటిలో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయనుకున్నారు. కాని వారికి వాటిలో కొన్ని చర్మపు కాగితాలు, పైపరస్ బెరడులపై వ్రాసిన వ్రాతప్రతులు కనబడ్డాయి. వారి దృష్టి బహుశా భౌతిక సంబంధమైన వస్తువులపై ఉంది గాని ఆ గ్రంధముల యొక్క విలువ బహుశా అప్పటికి వారికి తెలీదు. ఆ మట్టి కుండల్లో లభ్యమైన ఆ పత్రాలను తమ గృహాలకు తీసుకొని వెళ్ళి అందరికి చూపించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సలహా ఏమిటంటే ఎక్కడో చోట, ఎవరికోకరికి వీటిని అమ్మేస్తే కొంతైనా డబ్బులు రాబట్టవచ్చునని కొన్ని రోజులు వాటిని వారి దగ్గర ఉంచుకొని చివరకు వాటిని 29 డాలర్లకు అమ్మేస్తారు. ఆ విలువైన పత్రాలు అనేకుల చేతులు మారి సిరియా దేశపు బిషప్గా ఉన్న అతానిసియస్ సామ్యూల్ చేతిలో పడ్డాయి. ఆయనను మార్ సామ్యూల్ అని కూడా పిలుస్తారు. డెడ్సీ స్క్రాల్స్ గూర్చి అధ్యయనాల్లో  ప్రముఖంగా కనిపించేది ఇతని పేరు. కారణం ఆ పత్రాలు. గ్రంధపు చుట్ట విలువ మొదటిగా తెలుసుకున్నది ఇతనే. మార్ సామ్యూల్ వీటిని జాగ్రత్తగా  పరిశీలించడం ప్రారంభించాడు. హెబ్రీ భాషలో వ్రాయబడిన ఆ లిఖిత పత్రాలను శ్రద్ధగా అధ్యయనం చేసి వాటి విశిష్టతను  లుసుకొన్నాడు.

ప్రపంచమంతా నివ్వెరపోయే ఓ అద్భుత వ్యాఖ్యను చేశాడు. 'ప్రపంచంలోనే అత్యంత విలువైన పత్రాలు నా దగ్గరున్నాయి' అని మార్ సామ్యూల్ బహిరంగ వ్యాఖ్య చేశాడు. మార్ సామ్యూల్ పరిశోధనల్లో తేలిన ఫలితార్ధమిదే. ఖుమ్రాన్ గుహల్లో దొరికిన కుండల్లో లభ్యమైన వ్రాతప్రతులు సామాన్యమైనవి కావు. అవి విలువైన 'బైబిల్' గ్రంధము యొక్క వాస్తవ వ్రాతప్రతులు. దేవాది దేవుని ప్రేరేపణతో, ప్రత్యక్షతలతో వ్రాయబడిన గ్రంధాలు. క్రీ.పూ.ఎన్నో సంవత్సరాలకు ముందే పరమతండ్రి, స్వయంభవుడు అయిన దేవుడు ప్రజానీకానికి ఇచ్చిన ఆజ్ఞలు, సూచనలు, వాగ్దానాలు, ప్రవక్తలు దైవాత్మ ప్రేరేపణతో వ్రాసిన మాటలు. అప్పటికి మార్ సామ్యూల్ యొద్ద ఉన్న గ్రంధాలు ఈ విధంగా గుర్తించబడ్డాయి. Isaiah Scroll (యెషయా గ్రంధము). The Community Rule (కమ్యూనిటీ రూల్). Habakkuk Pesher (హబక్కుకూ గ్రంధ వ్యాఖ్యానము). Genesis Apocryphon ఈ లోపులో ఇశ్రాయేలు దేవానికి స్వాతంత్య్రం రావడం, చెదిరిపోయిన యూదులందరూ ఆయా దేశాల నుండి ప్రోగుచేయబడి ఒకచోట ఒక దేశంగా సమకూడడం ఆ వెనువెంటనే ప్రక్కదేశాలు ఇజ్రాయేల్పై యుద్ధానికి రావడం చరిత్రలో గమనించదగ్గ విషయాలు. ఆ యుద్ధ భీభత్సంలో ఈ దివ్యజ్ఞాన గ్రంధం యొక్క మూల లిఖిత పత్రాలకు ఎటువంటి హాని కలుగకూడదనే ఉద్దేశ్యంతో బిషప్ మార్ సామ్యూల్ వీటన్నింటిని లెబనాన్ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఎట్టకేలకు అత్యంత విలువైన, ప్రతిష్టాత్మకమైనఈ గ్రంధాల గొప్పతనాన్ని గుర్తించిన ఇజ్రాయేల్ దేశంలో హిబ్రూ యూనివర్శిటీలో ప్రొఫెసర్ బెంజిమన్ మాజర్ మరియు ప్రొఫెసర్ యదీన్ వాటిని యెరూషలేమునకు తీసుకొనివచ్చారు. అందుకుగాను వారు ఖర్చుచేసిన మూల్యం ఎంతో తెలుసా? అక్షరాల రెండు లక్షల యాభైవేల డాలర్లు. 1947 నుండి 1956 వరకు దాదాపు 900 డాక్యుమెంట్లు ఖుమ్రాన్ గుహలలో లభించాయి. వాటిలో ఎన్నో ఎన్నో శ్రేష్టమైన అంశాలు దాగి ఉన్నాయి. కీర్తనలు గ్రంధం, సామెతల గ్రంధం, ప్రవక్తల గ్రంధాలు, చారిత్రక గ్రంధాలు ఇలా అనేక గ్రంధాలు ఈ గుహల్లోనే లభ్యమయ్యాయి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యధార్ధమైనది (కీర్త 19:7) మరియు సత్యమైనవి (కీర్త 19:9) అని పరిశుద్ధ గ్రంధం సెలవిస్తున్న రీతిగా తిరుగులేని ఆధారాలు నిదర్శనాలు బైబిల్ గొప్పతనాన్ని నిరూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిని మనం గమనిస్తే దొరికిన ఆ గ్రంధాలన్నింటిని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నారు.